పాకిస్తాన్‌కు సమస్య మీద సమస్య వచ్చి పడుతోంది. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఏ సంకట స్థితి వస్తుందో పాలకులకే అర్థం కావడం లేదు. ఆర్థిక సమస్య పాక్‌ను వెంటాడుతోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని దుస్థితిలోకి నెట్టివేయబడింది. తాజాగా మరో సమస్యతో పాకిస్తాన్ సతమతవుతోంది. పాక్‌లో గ్యాస్ నిల్వలు బాగా తగ్గిపోయాయని, రానున్న రోజుల్లో గ్యాస్ సంక్షోభం పాక్‌ను చుట్టుముడుతుందని సాక్షాత్తూ పాక్ ప్రభుత్వమే ప్రకటించింది. పాకిస్తాన్ ప్రసారశాఖా మంత్రి ఫవాద్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న రోజుల్లో పాక్ వద్ద గ్యాస్ నిక్షేపాలేమీ మిగలవు. గత రెండేళ్లుగా ఏటా 9 శాతం గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయి అని ప్రకటించారు.
పెద్ద పెద్ద నగరాల్లో 23 శాతం మంది గ్యాస్ రాయితీ పొందుతున్నారని, ఎల్పీజీ, బొగ్గు, ఇతర మార్గాల్లో ఉన్న వారు ఈ భారాన్ని మోస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పెద్ద పెద్ద నగరాల్లో గ్యాస్ రాయితీని పొందుతున్న వారు అతి త్వరలోనే ఈ సదుపాయాన్ని వదులుకోవాల్సి వస్తుందని, ఇది ఎక్కువ కాలం కొనసాగదని తేల్చి చెప్పారు. అందరికీ సమానంగా గ్యాస్ సరఫరా చేయాలంటే గ్యాస్ సరఫరా విధానాన్ని సమూలంగా మార్చాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై ఓ సమగ్ర రిపోర్టు తయారు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖను కేంద్ర మంత్రి మండలి ఆదేశించింది.