న్యూఢిల్లీ: కరోనా టెన్షన్లో ఏది నిజం, ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. వైరస్ ధాటికి జనం పుకార్ల ఉచ్చులో పడిపోతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. నీతి ఆయోగ్ సభ్యుడు, నెగ్‌వాక్ చైర్మన్ డాక్టర్ వినోద్ పౌల్ ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో షికారు చేస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఏడు రకాల అపోహలకు ఆయన సమాధానం ఇచ్చారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ కోసం కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వస్తున్న పుకార్లకు ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం కూడా చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడం లేదన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వాలన్న అంశంపై ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎటువంటి మార్గదర్శకాలను రిలీజ్ చేయలేదు. కానీ చిన్నారుల్లో పనిచేసే రీతిలో వ్యాక్సిన్లు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. భారత్‌లో చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ త్వరలో జరగనున్నాయని, కానీ వాట్సాప్‌లో వస్తున్న సందేశాల ద్వారనో.. లేక రాజకీయవేత్తల ఆరోపణల ద్వారనో.. చిన్నారులకు వ్యాక్సినేషన్ జరగదని, డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు తీసుకునే నిర్ణయం ఆధారంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని డాక్టర్ వినోద్ పౌల్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న వ్యాక్సిన్లకు భారత్ అనుమతి ఇవ్వడం లేదని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ, యురోపియన్ మెడికల్ ఏజెన్సీ, బ్రిటన్‌కు చెందిన ఎంహెచ్ఆర్ఏ, జపాన్‌కు చెందిన పీఎండీఏ, డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ జాబితాలో ఉన్న టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు డాక్టర్ వినోద్ పౌల్ చెప్పారు. రాష్ట్రాల బాధ్యతను కేంద్రం విస్మరించిందన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు నిధులను ఇస్తూ నేరుగా రాష్ట్రాలకే టీకాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విదేశీ టీకాలకు త్వరగా అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఒప్పందం ప్రకారమే పారదర్శకంగా ఆయా రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
Myth: Centre is not giving enough vaccines to the States
— PIB India (@PIB_India) May 27, 2021
Fact: Centre is allotting enough vaccines to the states in a transparent manner
States are being informed in advance of the vaccine availability 5/5
Read details: https://t.co/UXv3ytaGaA