పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)ను ముద్దుగా సుశాసన్ బాబు అని పిలుస్తారు. ఇంకా ఆయన్ను పాల్తూ రామ్.. పాల్తూ చాచా అంటూ కూడా పిలుస్తుంటారు. అయితే బీహార్(Bihar Assembly Election Results)లో ప్రస్తుతం ఎన్డీఏ దళం దూసుకెళ్తున్నది. ఆ కూటమియే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. మహాఘట్బంధన్ తీవ్రంగా పోటీ ఇచ్చినా .. సుశాసన్ బాబును దెబ్బతీయలేకపోయారు. సీఎం నితీశ్ కెరీర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే .. తన పార్టీని విజయపథంలో నడిపారు. సుశాసన్ బాబు నితీశ్ కుమార్ ఎంత ఘనుడంటే.. ఆయన 1995 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అసలు పోటీయే చేయలేదు. ఓ ఎమ్మెల్సీగానే ఆయన ఎన్డీఏ కూటమిని ముందుకు నడుపుతున్నారు. 2025 ఎన్నికల్లో పోటీ చేయకుండానే నితీశ్ తన రాజనీతిని చాటేశారు.
నితీశ్ కుమార్‌ను అజేయ శక్తిగా అభివర్ణిస్తారు. స్నేహితులైనా… శత్రవులైనా.. కూటమి మిత్రులైనా.. బీహార్ సీఎం నితీశ్ చాణక్యనీతికి అందరూ లాల్ సలాం కొడుతారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకుండానే అత్యున్నత సీఎం పదవిలో ఆయన కొనసాగుతున్న తీరు అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నది. బీహారీల రాజకీయ ట్యాలెంట్ ఎలా ఉంటుందో ఆయన తన పాలనా విధానంలో చూపిస్తున్నారు. 2005 నుంచి బీహార్ సీఎంగా నితీశ్ కొనసాగుతున్నారు. చాన్నాళ్లుగా ఆయన నేరుగా పోటీకి దిగలేదు.
నితీశ్ కుమార్ చివరిసారి 1995లో అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు. నలంద జిల్లాలోని హర్నౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. సమతా పార్టీ అభ్యర్థిగా అప్పట్లో ఆయన విక్టరీ సాధించారు. జనతా పార్టీకి చెందిన విశ్వ మోహన్ చౌదరీ ఓటమి పాలయ్యారు. 1985లో హర్నౌత్ నుంచే లోక్ దళ్ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ నేత విర్జ్నందన్ ప్రసాద్ సింగ్‌పై విజయం సాధించారు.
1989లో నితీశ్ కుమార్ తొలి సారి లోక్‌సభలోకి ఎంట్రీ అయ్యారు. బార్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. అయిదు సార్లు ఆయన ఆ స్థానానికి పోటీ చేశారు. 1989 నుంచి 1999 వరకు బార్ నుంచి పోటీ చేశారు. అయితే డిలిమిటేషన్ తర్వాత బార్ నియోజకవర్గం మారడంతో .. 2004 లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. బార్‌తో పాటు నలంద నుంచి ఆయన పోటీ చేశారు. బార్ లో ఓటమి చెందగా, నలంద నుంచి ఆయన విజయం సాధించారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2006లో బీహార్ విధాన సభలో నితీశ్ సభ్యుడయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నితీశ్ కుమార్.. నాలుగోసారి సీఎం సీటుపై కన్నేశారు. తాజా సమాచారం ప్రకారం బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. మహాఘట్బంధన్ 60 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఎన్డీఏ కూటమిలోని జేడీయూ 77, బీజేపీ 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆర్జేడీ 55, కాంగ్రస్ 11 స్థానాల్లో దూసుకెళ్తున్నాయి.