సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 03:11:51

నిర్భయ దోషులకు 20న ఉరి

నిర్భయ దోషులకు 20న ఉరి
  • మరోసారి ఢిల్లీ కోర్టు డెత్‌ వారంట్లు
  • న్యాయపరమైన మార్గాలు బంద్‌
  • ఈసారి శిక్ష అమలు ఖాయం!

న్యూఢిల్లీ, మార్చి 5: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు వారిని ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేసింది. దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో ఈసారి ఉరి అమలు ఖాయంగా కనిపిస్తున్నది. దోషులు ఇప్పటికే అన్ని న్యాయపరమైన అవకాశాల్ని వినియోగించుకున్నారని ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా తాజా డెత్‌ వారెంట్లు జారీ చేశారు. మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32) ఇప్పటికే పలుమార్లు ప్రయత్నిస్తూ వచ్చారు. 


న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడింది. మార్చి 3న మరోసారి ఉరితీయాలని డెత్‌వారెంట్లు జారీ అయినప్పటికీ పవన్‌ గుప్తా రాష్ర్టపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడంతో మరోసారి ఉరి అమలు వాయిదా పడింది. అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఢిల్ల్లీ ప్రభుత్వం బుధవారం డెత్‌వారెంట్ల జారీపై పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. 


నలుగురికి ఒకేసారి ఉరిపై..

నిర్భయ కేసులో నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల్ని సవాల్‌ చేస్తూ కే్రంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 23న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అయితే, దోషుల్ని మార్చి 20న ఉరి తీయాలని ట్రయల్‌ కోర్టు తాజాగా డెత్‌ వారెంట్లను జారీ చేసిందని కేంద్రం తరుఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శిక్ష అమలును జాప్యం చేయడానికి దోషులు పలు ఎత్తుగడలు వేస్తూ న్యాయవ్యవస్థను పరిహసించారని ఆరోపించారు. వాదనలు విన్న జస్టిస్‌లు ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌, ఎస్‌ బోపన్నతో కూడిన సర్వోన్నత ధర్మాసనం.. మార్చి 23న విచారణ చేపడుతామని, దీనిపై ఎలాంటి వాయిదాల్ని అనుమతించబోమని తెలిపింది.


logo