న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీరు నుంచి ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ మంగళవారం దీనిపై ఆదేశాలను జారీ చేస్తారు. రషీద్ ఈ నెల 5న లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇంజినీర్ రషీద్‌ను ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసులో అరెస్ట్ చేశారు. ఆయన బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచారు. ప్రమాణం చేయడానికి తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని ఆయన కోర్టును కోరారు. దీంతో కోర్టు ఎన్ఐఏ స్పందనను కోరింది.
మీడియా అనుమతులపై ఆంక్షల్ని ఎత్తేయండి
ఓం బిర్లా, జగదీప్ ధన్కర్లకు ‘ఎడిటర్స్ గిల్డ్’ లేఖ
న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యక్రమాల కవరేజీకి సంబంధించిన మీడియా అనుమతులపై ఆంక్షల్ని తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ధన్కర్లను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కోరింది. సోమవారం ఈ మేరకు లేఖ రాసింది. అదనపు పాసులు అవసరం లేకుండా, అన్ని మీడియాల్లో పనిచేసే గుర్తింపు ఉన్న ఉద్యోగులందరికీ పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించాలని ధన్కర్ను కోరింది. శాశ్వత అక్రిడేషన్ ఉన్నవారితో సహా మీడియా వ్యక్తుల సంఖ్యను పరిమితం చేసే పద్ధతి ‘కొవిడ్-19’ ప్రొటోకాల్ అమల్లో ఉండగా కేంద్రం తీసుకొచ్చిందన్న సంగతిని ఓం బిర్లాకు రాసిన లేఖలో ‘ఎడిటర్స్ గిల్డ్’ ప్రస్తావించింది. ‘ప్రెస్ అడ్వయిజరీ కమిటీ’ని తిరిగి ఏర్పాటుచేయక పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది.