Jagannath Temple | ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు దర్శనం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఈ కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఆదివారం తెలిపారు. ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త విధానానికి సంబంధించిన ఏర్పాటు ఈ నెల 27, 28 తేదీల్లోగా పూర్తవుతాయన్నారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామన్నారు. జనవరి ఒకటి నుంచి కొత్త దర్శన విధానం పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువస్తామన్నారు. ఈ కొత్త విధానంలో ఆలయానికి వచ్చే మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్త విధానంలో భక్తులు ప్రస్తుతం ఉన్న ద్వారం (సత్పహచ) నుంచి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశిస్తారు.
అయితే, బయటకు వెళ్లేందుకు రెండు వేర్వేరు దారులుంటాయి. జగన్నాథ ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి (SJTA) అరబింద పాడి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో కొత్త విధానం అమలుకు సంబంధించిన పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ కారణంగా గర్భగుడిలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకోవడానికి తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త విధానంలో నాట్య మండపంలో ఆరు వరుసల్లో ప్రత్యేకంగా బారికేడట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల కోసం ఒడిశా బ్రిడ్జి అండ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ని నియమించి.. ఏడాది చివరికల్లా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రత్న భండార్ మరమ్మతు పనులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన చెప్పారు. రత్నా భండార్ పునరుద్ధరణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.