NCERT | న్యూఢిల్లీ: ఆంగ్ల మాధ్యమంలోని కొత్త పాఠ్య పుస్తకాలకు ఎన్సీఈఆర్టీ రోమన్ లిపిలో హిందీ పేర్లను పెట్టడం వివాదాస్పదమైంది. ఆయా భాషా మాధ్యమ పుస్తకాలకు ఆయా భాషల్లోనే పేర్లను పెట్టే సంప్రదాయాన్ని తాజా చర్యలు ఉల్లంఘించాయి. ఉదాహరణకు ఆరో తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకానికి గతంలో హనీసకల్ అనే పేరుండేది. ఇప్పుడు ఆ పేరును పూర్వీగా మార్చారు.
ఒకటి, రెండో తరగతుల పాఠ్య పుస్తకాల పేర్లను మృదంగ్ అని, మూడో క్లాస్ పుస్తకాల పేరును సంతూర్ అని మార్చారు. తమిళనాడు లాంటి రాష్ర్టాలు త్రిభాషా విధానం అమలును వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. ఆంగ్ల మాధ్యమ పుస్తకాలకు హిందీలో పేర్లు పెట్టడాన్ని కేరళ విద్యా శాఖ మంత్రి శివన్కుట్టి వ్యతిరేకించారు. భాషా వైవిధ్యాన్ని దెబ్బ తీశారని అన్నారు.