ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంచలనం రేపిన క్రూయిజ్ డ్రగ్స్ కేసులో చార్జిషీట్ దాఖలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి గడువును మరో 60 రోజులు కోర్టు పొడిగించింది. గత ఏడాది అక్టోబర్ 2న జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో సహా 20 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. ఎన్సీబీ ఈ కేసుపై గత ఆరు నెలలుగా దర్యాప్తు జరుపుతున్నది. కేసు నమోదైన 180 రోజుల్లోగా చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. ఈ గడువు గురువారంతో ముగిసింది.
ఈ నేపథ్యంలో చార్జిషీట్ దాఖలు చేసే గడువును 90 రోజులు పొడిగించాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 180 రోజుల్లో చేసిన దర్యాప్తు గురించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేత్నా కోర్టుకు వివరించారు. పూణే ల్యాబ్‌కు పంపిన 17 నమూనాల రిపోర్టులు మార్చి 21న అందాయని తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టంలో నిర్వచించినట్లుగా ఆయా నమూనాలలో మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ మందులు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 69 మంది స్టేట్మెంట్లను ఎన్సీబీ రికార్డు చేసిందన్నారు. 10 మంది స్వతంత్ర సాక్షులను ప్రశ్నించిందని, మరో నలుగురిని ప్రశ్నించాలని ఉందని కోర్టుకు తెలిపారు.
మరోవైపు చార్జిషీట్ దాఖలు కోసం గడువు పొడిగింపును ఎస్పీబీ కోరడాన్ని నిందితుల తరుఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తును కొనసాగించుకోవచ్చని కోర్టుకు తెలిపారు. అవసరమైతే అదనపు చార్జిషీట్‌ను తర్వాత దాఖలు చేయవచ్చన్నారు. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు బుధవారం ఈ తీర్పును రిజర్వ్ చేసింది. అయితే చార్జిషీట్ దాఖలు కోసం ఎన్సీబీకి మరో 60 రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు కోర్టు గురువారం వెల్లడించింది.