కొత్తగూడెం ప్రగతి మైదాన్, హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీని రూపు మాపడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ ‘కగార్’ రూట్ మార్చి కొత్త పంథాలో వెళుతోంది. మావోయిస్టుల ఏరివేతే ధ్యేయంగా పెట్టుకుని అడవుల్లో ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్’ పేరుతో అగ్రనేతల కోసం వేటాడుతున్నాయి భద్రతా బలగాలు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు గణపతి, హిడ్మా అంతం అని తెలుస్తోంది. గడిచిన మూడు నెలల వ్యవధిలో మావోయిస్టు పార్టీ ఎన్నో నష్టాలను చవి చూసింది.
అందులో భాగంగానే ఆ పార్టీ తమ అధినాయకత్వాన్ని కోల్పోయింది. మావోయిస్టు పార్టీ సుప్రీమ్ లీడర్ నంబాల కేశవరావు మృతి చెందిన తరువాత అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేజర్ ఎన్కౌంటర్ తరువాత బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పార్టీ అగ్రనేతలనే టార్గెట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోందన్న విషయాన్ని గుర్తించిన నక్సలైట్ నాయకులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ అదను కోసం ఎదురు చూస్తూ తలదాచుకుంటున్నారు.
2026 మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని తుద ముట్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు వివిధ కోణాల్లో అస్ర్తాలను సంధిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ ‘కగార్’ని నిలిపి వేయాలంటూ వచ్చిన ఒత్తిళ్ల మేరకు కొంత రూట్ డైవర్షన్ తీసుకుంది. కానీ సెర్చింగ్ ఆపరేషన్స్ పేరుతో చేస్తున్న ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్’ను చాప కింద నీరులా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిన మోస్ట్ వాంటెడ్, పీఎల్జీఏ చీఫ్ హిడ్మా కోసం ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రత్యేకంగా అదనపు బలగాలను ఉసి గొల్పుతున్నట్లు సమాచారం. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్రల సరిహద్దుల్లోని నదీ తీర అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తలదాచుకున్నారనే విశ్వసనీయ సమాచారంతో అదనపు ప్రత్యేక బలగాలతో సెర్చింగ్ ఆపరేషన్స్ వేగవంతం చేశారు పోలీస్ ఉన్నతాధికారులు.
ఛత్తీస్‌గఢ్ నేషనల్ పార్కులో వెంటనే కాల్పులు ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గణపతి, హిడ్మా సహా పలువురు మావోయిస్టుల అగ్రనేతలు ఆ పార్కులోనే ఉన్నట్టు భద్రతా బలగాలు చెప్తున్నాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ పార్క్‌ను చుట్టముట్టిన కేంద్ర బలగాలు వెంటనే వెనక్కి రావాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మావోయిస్టులు సజీవంగా పట్టుబడితే వారికి ప్రాణహాని తలపెట్టవద్దని ప్రభుత్వాలను కోరారు.