Yashwant on Nitish | తాను బీహార్ సీఎం నితీశ్‌కుమార్ స్థాయిని అందుకోలేనని విపక్షాల తరుపున పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. శుక్రవారం బీహర్ ప్రజా ప్రతినిధులను కలుసుకునేందుకు పాట్నా వచ్చారు. పలు దఫాలు నితీశ్‌కుమార్‌తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించినా.. తన కాల్స్‌కు బీహార్ సీఎం ప్రతిస్పందించలేదని మీడియాకు చెప్పారు. తమకు బీహార్ అధికార కూటమిలో నితీశ్ కుమార్ సారధ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీ మిత్రపక్షం అని బీజేపీ భావిస్తుందన్నారు. ఇప్పటికే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును నితీశ్ కుమార్ కలుసుకున్నారని గుర్తు చేశారు. ద్రౌపదికే నితీశ్ మద్దతు ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు యశ్వంత్ సిన్హా చెప్పారు. అలాగే `బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు పదేపదే ఫోన్ చేశాను. మెసేజ్‌లు పంపాను. నితీశ్‌కుమార్ మాట్లాడడానికి నాస్థాయి చిన్నది కావచ్చు. అందుకే ఆయన నాతో మాట్లాడలేదనుకుంటా` అని అన్నారు.
`నితీశ్‌కుమార్ బీహార్ గురించి ఆలోచించి ఉంటే, బీహార్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థికి ఆయన ఎందుకు మద్దతు ఇవ్వరు? ఇది నాకు అర్థం కాలేదు. వారు (ఎన్డీఏ) రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు మద్దతు ఇస్తానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన చేశారు` అని సిన్హా గుర్తు చేశారు