పాట్నా: బీహార్లోని భగల్పూర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్( Lalan Paswan).. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిర్పైంతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆయన హిందువుల విశ్వాసాలను తప్పుపట్టారు. తన వాదనలు తప్పు అనడానికి ఆధారాలు చూపించాలని కూడా ఆయన వాదించారు. ఎమ్మెల్యే లాలన్ వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానికులు భగల్పూర్లో నిరసన చేపట్టి ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు.
దీపావళి వేళ లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారని ఆయన ప్రశ్నించారు. లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే డబ్బు వస్తుందని అనుకుంటే, అప్పుడు ముస్లిం మతస్థుల్లో బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉండేవారు కాదన్నారు. ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరని, మరి వాళ్లు సంపన్నులు కాలేదా అని ఆయన అడిగారు. సరస్వతీ దేవిని కూడా ముస్లింలు పూజించరు అని, మరి ఆ ముస్లింలలో పండితులు లేరా అని ఎమ్మెల్యే లాలన్ ప్రశ్నించారు. వాళ్లలో ఐఏఎస్లు, ఐపీఎస్లు లేరా అని ఆయన అడిగారు.
ఆత్మ, పరమాత్మ అనేది కేవలం ప్రజల నమ్మకం మాత్రమే అని ఎమ్మెల్యే లాలన్ తెలిపారు.మీరు నమ్మితే అదే దేవుడు అని, లేదంటే అదో రాయి ప్రతిమ అవుతుందని, దేవుళ్లు..దేవతల్ని నమ్మడం మనపై ఆధారపడి ఉందని, శాస్త్రీయ పద్ధతిలో ప్రతిదాన్ని ఆలోచించి, నిర్ణయానికి రావాలన్నారు. మీరు దేవుల్ని నమ్మడం ఆపేస్తే, అప్పుడు మీలో మేధస్సు పెరుగుతుందని ఆయన అన్నారు.
భజరంగభళీ మహా శక్తి సంపన్నుడని నమ్ముతారని, కానీ ముస్లింలు, క్రిస్టియన్లు భజరంగభళీని పూచించరని, మరి వాళ్లు శక్తివంతులు కాదా అని ఎమ్మెల్యే లాలన్ ప్రశ్నించారు. మీరు నమ్మడం ఆపిన రోజు, ఇవన్నీ ముగిసిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు.