Mumbai Rains | మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. 24గంటల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మహారాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ పేర్కొంది. నాందేడ్ జిల్లాలో వరదల కారణంగా ఐదుగురు వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మొత్తం 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబయిల వర్షాల కారణంగా ట్రాక్‌లపై భారీగా వరద నీరు చేరడంతో మంగళవారం ఉదయం నిలిచిన హార్బర్ రైలు సేవలు దాదాపు 15గంటల తర్వాత బుధవారం తెల్లవారు జామున 3గంటలకు తిరిగి ప్రారంభమయ్యాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వానిల్ నీలా తెలిపారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, థానే మధ్య ప్రధాన లైన్ సేవలు మంగళవారం రాత్రి 7:30 గంటలకు తిరిగి ప్రారంభించారు. అయితే, నవీ ముంబయిని దక్షిణ ముంబయితో అనుసంధారించే హార్బర్ లైన్ రాత్రి సమయంలో మూసివేశారు. అనేక ప్రాంతాల్లో నీరు పట్టాలపైకి చేరుకుంది. బుధవారం ఉదయం నుంచి అన్ని ప్రజా రవాణా సేవలు, బస్సులు, స్థానిక రైళ్లు, మెట్రో సర్వీసులు సాధారణంగా పని చేస్తున్నాయని దికారులు తెలిపారు. మరో వైపు భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో అత్యవసరమైతేనే రైల్లో ప్రయాణించాలని, అప్రమత్తంగా ఉండాలని రైల్వేశాఖ ప్రయాణికులకు సూచించింది. వరదల కారణంగా పలు రూట్లలో బుధవారం సైతం రైళ్లను చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. డీఆర్ఎం, ముంబయి సెంట్రల్ మార్గంలో వరద కారణంగా స్థానిక రైలు సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణాలు వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, కార్యకలాపాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. తమవంతు సజావుగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. విమాన షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉంటే సమాచారం అందించనున్నట్లు పేర్కొంది. శాంతాక్రూజ్ అబ్జర్వేటరీ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం వరకు 24గంటల్లో 200 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. రాయ్‌గడ్‌లోని ప్రసిద్ధ మాథెరన్ హిల్ స్టేషన్లో అత్యధికంగా 382.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని, దక్షిణ ముంబయిలోని కొలాబా అబ్జర్వేటరీలో 24 గంటల్లో 107.4 మి.మీ వర్షపాతం రికార్డయ్యిందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం-బుధవారం ఉదయం మధ్య విఖ్రోలిలో 229.5, ముంబయి విమానాశ్రయంలో 208, బైకుల్లాలో 193.5, జుహులో 150, బాంద్రాలో 137.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.