భోపాల్: రోడ్డు ప్రమాదం ఘర్షణ నేపథ్యంలో కొందరు వ్యక్తులను కొట్టిన మంత్రి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను హింసించారని మంత్రి కుమారుడు ఆరోపించాడు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. (Cops Suspended) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆరోగ్యం, వైద్య విద్యా శాఖ మంత్రి శివాజీ పటేల్ కుమారుడు అభిజ్ఞాన్ పటేల్, అతడి స్నేహితులు శనివారం రాత్రి కారులో ప్రయాణించారు. భోపాల్లోని షాపూర్ ప్రాంతంలో జర్నలిస్ట్ వివేక్ సింగ్ బైక్ను వారి కారు ఢీకొట్టింది. దీంతో చూసుకుని నడపాలని డ్రైవర్ను ఆ జర్నలిస్ట్ మందలించాడు.
కాగా, మంత్రి కొడుకు అభిజ్ఞాన్ పటేల్, అతడి స్నేహితులు కారు నుంచి కిందకు దిగారు. జర్నలిస్ట్ వివేక్ సింగ్ను వారు కొట్టారు. ఇది చూసి స్థానిక రెస్టారెంట్ యజమానురాలైన అలీషా సక్సేనా జోక్యం చేసుకుంది. దీంతో మంత్రి కుమారుడు, అతడి స్నేహితులు రాడ్తో ఆమెను కొట్టారు. ఆమె భర్త, రెస్టారెంట్ సిబ్బంది కాపాడేందుకు రాగా వారిని కూడా కొట్టారు.
మరోవైపు రెస్టారెంట్ దంపతుల ఫిర్యాదుపై మంత్రి కొడుకు అభిజ్ఞాన్ పటేల్, అతడి స్నేహితులపై పోలీసులు కేను నమోదు చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలిసిన మంత్రి శివాజీ పటేల్ రాత్రివేళ ఆ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే పోలీసులు తమను హింసించారని, కొట్టారని మంత్రి కుమారుడు, అతడి స్నేహితులు ఆరోపించారు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వారిపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రెస్టారెంట్ దంపతులు, సిబ్బంది తమను కొట్టారని మంత్రి కుమారుడు ఎదురు ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ ఈ సంఘటనపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వం అరాచకానికి ఇది నిదర్శమని ఆరోపించారు. మంత్రి కుమారుడు అభిజ్ఞాన్ దాడిపై జర్నలిస్ట్ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని విమర్శించారు. అలాగే మహిళ తలకు ఆరు కుట్లుపడ్డాయని, అయినప్పటికీ హత్యాయత్నం కింద మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేయలేదని అన్నారు.
నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు వార్తా పత్రికల్లో వచ్చినప్పటికీ ఎస్ఎస్పీకి ఇది తెలియకపోవడం విడ్డూరంగా ఉందని జితూ పట్వారీ విమర్శించారు. మంత్రి కుమారుడు అభిజ్ఞాన్ తీరుపై సీఎం నిస్సహాయత ప్రజల నమ్మకాన్ని దెబ్బతిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై సీఎం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.