రాంచీ: ఒక మహిళ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నది. అయితే రెండేళ్ల కొడుకు ఏడ్వడంతో ఆమె విసుగుచెందింది. ఆగ్రహంతో పిల్లోడి గొంతు నొక్కి చంపింది. (woman strangles toddler son) నిద్రపోతున్నట్లుగా భర్తను నమ్మించేందుకు ప్రయత్నించింది. కుమారుడు అచేతనంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అఫ్సానా ఖాతూన్‌కు ఆరేళ్ల కిందట నిజాముద్దీన్‌తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు నాలుగు, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు.
కాగా, గురువారం అఫ్సానా తన భర్తతో గొడవపడింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల చిన్న కొడుకుతో కలిసి గడియ వేసుకుని గది లోపల ఉంది. భర్తతో గొడవ గురించి వేరే ఎవరితోనే మొబైల్ ఫోన్లో మాట్లాడింది. అయితే పిల్లోడు ఏడ్వడంతో మరింత విసిగిపోయింది. ఓదార్చక పోగా ఆ చిన్నారి గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత కూడా చాలాసేపు వరకు తలుపులు తీయలేదు.
మరోవైపు నిద్రపోయేందుకు భర్తను గదిలోకి అఫ్సానా పిలిచింది. ఈ సందర్భంగా రెండేళ్ల కుమారుడు అచేతనంగా ఉండటాన్ని నిజాముద్దీన్ గమనించాడు. బాలుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అఫ్సానా మామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఉద్దేశపూర్వకంగా కుమారుడ్ని చంపలేదని తల్లి అఫ్సానా తెలిపింది. ఏడుస్తున్నాడన్న ఆగ్రహంతో తోశానని, మంచం నుంచి కింద పడి చనిపోయాడని పోలీసులకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.