న్యూఢిల్లీ: మహమ్మద్ జుబేర్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. 2018లో చేసిన ఓ ట్వీట్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా తొలుత ట్వీట్ చేసింది ఇతనే. ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యస్థాపకుడు జుబేర్. అయితే జుబేర్ రెచ్చగొట్టే ట్వీట్లను చేసినట్లు ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ప్రజల్లో ద్వేషభావాన్ని నింపే రీతిలో అతని ట్వీట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2018లో అతను ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. దాని కోసం ఓ సినిమా క్లిప్‌ను వాడారు. 1983లో రిలీజైన కిసీ సే నా కెహనా చిత్రంలోని ఓ హోటల్ సీన్‌ను తన ట్వీట్ కోసం వాడుకున్నారు. హనీమూన్ హోటల్‌ను అతను హనుమాన్ హోటల్‌గా మారుస్తూ ఆ ట్వీట్‌ను వైరల్ అయ్యేలా చేశాడు. హానీమూన్ అక్షరాలకు పెయింట్ వేసి దాన్ని హనుమాన్‌గా మార్చేశాడు. 2014కు ముందు ఇది హనీమూన్ హోటల్ అని, 2014 తర్వాత ఇది హనుమాన్ హోటల్ని రాశాడు.
అయితే ఈ కేసులో జుబేర్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మతపరమైన భావాలను కించపరిచినట్లు జుబేర్‌పై కేసు బుక్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అతన్ని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. మతపరమైన మనోభావాలను కావాలనే దెబ్బతీయాలన్న కక్ష్యతో జుబేర్ అలాంటి పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి జుబేర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను జుబేర్ వక్రీకరించినట్లు కూడా నుపుర్ ఫిర్యాదు చేసింది. జుబేర్‌ను అరెస్టు చేయడాన్ని విపక్షాలు ఖండించాయి. ఢిల్లీ పోలీసుల అతన్ని టార్గెట్ చేసినట్లు ఆరోపించాయి. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతిక్ సిన్హా మాట్లాడుతూ.. జుబేర్ అరెస్టుపై తమకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదన్నారు.