వడోదర, మే 2: కొందరు నరేంద్ర మోదీ అభిమానుల ప్రభు భక్తి ఇప్పుడు విద్యా సంస్థలకు కూడా పాకడంతో ఆయన తత్వమే ఇప్పుడు యూనివర్సిటీ పాఠ్య ప్రణాళికగా మారింది. మోదీ తత్వం (ఆలోచనా విధానం, సిద్ధాంతం), ఆర్ఎస్ఎస్ చరిత్ర అంశాలను గుజరాత్, వడోదర లోని మహారాజ సయాజీరావు యూనివర్సిటీ సోషియాలజీ పీజీ కోర్సులో పాఠ్యాంశాలుగా చేర్చింది.
‘దేశభక్తి సమాజ శాస్త్రం’ అనే కొత్త కోర్సులో మోదీ తత్వంతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్, సయాజీరావు గైక్వాడ్-3 వంటి సంఘ సంస్కర్తల కృషిని శాస్త్రీయంగా విశ్లేషించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ విశ్వవిద్యాలయ సమాజ శాస్త్ర విభాగ అధిపతి వీరేంద్ర సింగ్ తెలిపారు. ప్రజా ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం నీతి ఆయోగ్ చేపట్టిన ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న సింగ్, సిలబస్లో అంతర్భాగంగా ఉన్న మీడియా, డిజిటల్ జాతీయ వాదం, పౌరసత్వం, భిన్నాభిప్రాయాలు, అలాగే ప్రపంచీకరణ, గుర్తింపు రాజకీయాలు వంటి అంశాల చర్చలో మోదీ తత్వం కూడా ప్రధానంశంగా ఉంటుందని పేర్కొన్నారు.