Noida Model Died | నోయిడాలోని ఫిల్మ్ సిటీలోని స్టూడియోలో జరిగిన ఫ్యాషన్ షోలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లైటింగ్ ట్రస్ అనూహ్యంగా కూలడంతో మోడల్‌పై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో మోడల్‌కు గాయాలు కాగా.. ఆమెను వెంటనే సెక్టార్ 27లోని కైలాస్ ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సెక్టార్-20 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ సిటీలో ఉన్న స్టూడియోలో ఫ్యాషన్ షో నిర్వహించారు. మృతురాలిని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని దివ్యాన్ష్ ఫ్లోరా హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల మోడల్ వంశిక చోప్రాగా గుర్తించారు. షో కొనసాగుతున్న సమయంలో లైటింగ్ ట్రస్ ఒక్కసారిగా విరిగి వంశికపై పడిపోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో బాబీ రాజ్ అనే మోడల్ సైతం గాయపడగా.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.
పోలీసులు నిర్వాహకులతో పాటు లైటింగ్ ట్రస్ ఏర్పాటు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, సమాచారం ప్రకారం.. నిర్వాహకులు ఫ్యాషన్ షో నిర్వహణకు అనుమతి తీసుకోలేదని తెలుస్తున్నది. ఇప్పటి వరకు బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు మేరకు బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.