ఢాకా: బంగ్లాదేశ్ 23వ దేశాధ్యక్షుడిగా మిర్జా ఫక్రుల్ ఇస్లామ్ ఆలమ్‌గిర్(Mirza Fakhrul Islam Alamgir) ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 255 ఓట్లు పోలయ్యాయి. 11 పార్టీల కూటమికి చెందిన అభ్యర్థి ఒలీ అహ్మద్‌పై ఆయన విజయం సాధించారు. ప్రత్యర్థికి కేవలం 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మిర్జా ఫక్రుల్ విజయం సాధించినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దిన్ ప్రకటించారు. జాతీయ పార్లమెంట్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ జరిగింది. తాత్కాలిక అధ్యక్షుడు హఫిజ్ ఉద్దిన్ అహ్మద్ బిర్ బిక్రమ్ తొలి ఓటు వేశారు. డిప్యూటీ స్పీకర్ కేసర్ కమల్, ప్రధాని తారిక్ రహ్మాన్ ఓటేశారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా సీఈసీ నాసిర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.
35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో దేశాధ్యక్షుడి పోస్టుకు ఎన్నికలు నిర్వహించారు. చివరిసారి 1991, అక్టోబర్ 8వ తేదీన ఆ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ లేకుండానే పలుమార్లు దేశాధ్యక్షులను నియమించారు. 1996, 2001, 2002, 2009, 2013, 2018, 2023లో ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తుతం బీఎన్పీ పార్టీకి మూడోవంతు మెజారిటీ ఉన్నది. శుక్రవారం మిర్జా ఫక్రుల్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.