శనివారం 28 మార్చి 2020
National - Feb 13, 2020 , 01:29:38

కాలుష్యంతో కాలిపోతున్న లక్షల కోట్లు

కాలుష్యంతో కాలిపోతున్న లక్షల కోట్లు
  • శిలాజ ఇంధనాల దహనంతో ఏటా 10.7 లక్షల కోట్ల నష్టం
  • లక్షల సంఖ్యలో మరణాలు.. కోట్ల సంఖ్యలో రోగులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: శీతాకాలం ప్రవేశించగానే వాయుకాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాలతో దేశరాజధాని ఢిల్లీ ప్రతిఏటా వార్తలకెక్కుతుంది. కానీ వాయు కాలుష్యం ప్రభావం దేశమంతా ఉన్నదని, దాని వల్ల అపార నష్టం జరుగుతున్నదని తాజాగా వెల్లడైంది. శిలాజ ఇంధనాలను దహనం చేయడం వల్ల కలిగే వాయు కాలుష్యంతో భారత్‌కు ఏటా రూ.10.7లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతున్నదని ఓ నివేదిక బుధవారం వెల్లడించింది. సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సీఆర్‌ఈఏ) ఇచ్చిన ఆధారాలతో ఆగ్నేయాసియా గ్రీన్‌పీస్‌ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం శిలాజ ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్యంతో భారత్‌కు జరుగుతున్న నష్టం దేశ జీడీపీలో 5.4 శాతం అని అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం 2.9 లక్షల కోట్ల డాలర్లని ఆ నివేదిక తెలిపింది. శిలాజ ఇంధనాల వల్ల అత్యధిక నష్టాన్ని చవిచూస్తున్న దేశాల్లో చైనా మొదటిస్థానంలో, అమెరికా రెండోస్థానంలో ఉండగా, భారత్‌ మూడోస్థానంలో నిలిచింది. శిలాజ ఇంధనాల వల్ల భారత్‌లో ఏటా జరుగుతున్న నష్టాన్ని ఆ నివేదిక ఇలా వివరించింది..


పది లక్షల మంది మృతి. 

  • నెలలు పూర్తికాకుండానే జన్మిస్తున్న వారు 9.80 లక్షలు
  • ఆర్థిక రూపేణా జరుగుతున్న నష్టం రూ.10.7 లక్షల కోట్లు
  • ప్రతిఏటా బాలల్లో నమోదవుతున్న 3.50 లక్షల ఆస్తమా కేసులకు కారణం శిలాజ ఇంధనాల ఉప ఉత్పత్తి అయిన నైట్రోజన్‌ డయాక్సైడ్‌. మొత్తంగా శిలాజ ఇంధనాల వల్ల 12.85 లక్షల మంది బాలలు ఆస్తమాతో సతమతమవుతున్నారు. 
  • కార్మికులు అనారోగ్యం కారణంగా పనులకు గైర్హాజరు కావడంతో ఏటా 49 కోట్ల దినాలను కోల్పోతున్నాం. 
  • ప్రభుత్వం ఆరోగ్య రంగంపై జీడీపీలో 1.28 శాతం ఖర్చు చేస్తుండగా,శిలాజ ఇంధనాల వల్ల కలిగే నష్టం జీడీపీలో 5.4 శాతంగా ఉన్నది.
  • శిలాజ ఇంధనాల వల్ల లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండగా, గుండెపోటు,ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఆస్తమా వంటి రోగాల ముప్పు మరింత పెరుగుతున్నది. 
  • ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించింది. 


logo