WaterAid | న్యూఢిల్లీ, మార్చి 12 : ప్రపంచంలో అధిక జనసాంద్రత కలిగిన కొన్ని నగరాల్లో వాతావరణం అస్థిరంగా ఉంటున్నదని, కరువుల నుంచి వరదలకు, ఆ వెంటనే మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి కరువులకు మారుతోందని ‘వాటర్ ఎయిడ్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దీంతో ప్రపంచ నీటి చక్రం (వాటర్ సైకిల్) ధ్వంసమవుతోందని బుధవారం విడుదల చేసిన అధ్యయన నివేదికలో పేర్కొంది. నిరంతరం మారుతున్న అస్థిర వాతావరణ పరిస్థితులతో లక్నో, ముంబై లాంటి భారతీయ నగరాలు సతమతమవుతున్నట్టు స్పష్టం చేసింది. దక్షిణాసియా, ఆగ్నేయ ఆసి యా ప్రాంతాలు తీవ్రమైన తేమ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, మధ్యప్రాచ్యంతోపాటు యూరప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు నిరంతరం పొడిగా మారుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ప్రపంచంలో అధిక జనాభా ఉన్న వందకుపైగా నగరాల నుంచి 42 ఏండ్ల వాతావరణ సమాచారాన్ని సేకరించి వారు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
వాతావరణ మార్పులతో కొన్ని ప్రాంతాలకు లాభం, మరికొన్ని ప్రాంతాలకు నష్టం వాటిల్లుతోందని కార్డిఫ్ యూనివర్సిటీలోని వాటర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మైఖేల్ సింగర్ పేర్కొంటూ.. ఈ పరిస్థితిని ‘ప్రపంచ వింత’గా అభివర్ణించారు. అస్థిర వాతావరణ పరిస్థితుల వల్ల అధికంగా సతమతమవుతున్న ప్రాంతాల జాబితాలో చైనా తూర్పు నగరమైన హాంగ్ ఝౌ, ఇండోనేషియా రాజధాని జకార్తా అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. సర్వే నిర్వహించిన ప్రాంతాల్లో 15% నగరాలు ఈ 2 రకాల అధ్వాన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఒకేసారి వరదలు, కరువు బారినపడుతున్నాయని వెల్లడైంది. ఇలాంటి నగరాల జాబితాలో అమెరికాలోని డాలస్, షాంఘై, బాగ్దాద్ ముందు వరసలో ఉన్నట్టు ‘వాటర్ ఎయిడ్’ స్పష్టం చేసింది.