లక్నో : అన్ని కులాలు, వర్గాలకు తమ పార్టీ చేరువవుతుండటంతో బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్‌లు ఉలికిపడుతున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బీజేపీ పక్షపాత వైఖరితో విసిగిన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు అగ్రవర్ణాల ప్రజలు ముఖ్యంగా బ్రాహ్మణులు బీఎస్పీకి దగ్గరువుతున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీఎస్పీకి చేరువవుతుండటంతో తమ రాజకీయ ప్రత్యర్ధులు ఎస్పీ, కాంగ్రెస్, బీజేపీలు బెంబేలెత్తుతున్నాయని మాయావతి వ్యాఖ్యానించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ బీఎస్పీ వ్యతిరేక శక్తులు కుట్ర రాజకీయాలు మరింత బహిర్గతమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి ఇప్పటికే ప్రకటించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలైనా బీఎస్పీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఇటీవల ఆమె తేల్చిచెప్పారు. 2022 ఆరంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
యూపీలో ఎస్పీ 400 స్దానాలు పైగా గెల్చుకుంటుందని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తుండగా అదికారం నిలుపుకునేందుకు బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. మరోవైపు ప్రియాంక గాంధీని ముందుంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ యూపీ పోరుకు సన్నద్ధమవుతోంది.