న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అగ్రవర్ణ కులస్తులకు 40 సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అంశం ఆధారంగా అగ్రకుల అభ్యర్థుల సంఖ్యను బీఎస్పీ చీఫ్ మాయావతి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. యూపీలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీకి కావాల్సినంత స్థాయిలో ఎస్సీ క్యాడర్ ఉన్నది. దళితేర ఓట్లను కూడా ఆకర్షించే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. ఎస్సీలు, బ్రాహ్మణులతో కలిపి పార్టీని కూర్పు చేసే ఆలోచనలో మాయావతి ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు.
బ్రాహ్మణ సమాజ వర్గంతోనూ మాయావతి ఇటీవల పలుమార్లు సమావేశమైనట్లు తెలుస్తోంది. యూపీలో ఉన్న ఇతర ఉన్నత కులాలైన భూమిహార్, వైశ్యులను కూడా తమ పార్టీలోనే కలుపుకోవాలని మాయావతి ప్లాన్ చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. 2009లో ఇదే ప్లాన్‌తో వెళ్లిన మాయావతి అద్భుతమైన సక్సెస్ సాధించారు. ఈసారి యూపీలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా దళిత ఓటర్లనే టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో.. బీఎస్పీ కొత్త తరహా ప్రణాళిక వేయాలనుకుంటోంది. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం ముస్లిం ఓటర్లను టార్గెట్ చేసింది.