తిరువనంతపురం: ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బందిని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కేరళలోని కొట్టాయంలో ఈ సంఘటన జరిగింది. కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న భవనంలో సోమవారం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అక్కడున్న వారు భయాందోళన చెందారు. బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని డయాలసిస్ యూనిట్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ వార్డులలోని రోగులను వెంటనే మరో భవనానికి తరలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తున్న కార్మికులు కూడా భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. పలు ప్రాంతాల నుంచి పది అగ్నిమాపక వాహనాలు మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నాయి. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తున్నది. కాగా, ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.