PM Modi Cabinet | న్యూఢిల్లీ, జూన్ 9: మునుపటి మంత్రివర్గంలో పనిచేసిన చాలా మందికి తాజా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, అజయ్ మిశ్రా, నారాయణ రాణే, మీనాక్షి లేఖి, అజయ్ భట్ సహా దాదాపు 37 మంది కమలం పార్టీ నేతలను క్యాబినెట్ నుంచి తప్పించారు. వీరిలో కొంతమంది తాజా ఎన్నికల్లో ఓడిపోగా, మరికొంత మంది పోటీచేయలేదు.
కొందరు గెలిచినప్పటికీ క్యాబినెట్లోకి తీసుకోకపోవడం గమనార్హం. అజయ్ భట్, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే వంటి వాళ్లు ఎన్నికల్లో గెలిచినప్పటికీ, వారికి మంత్రివర్గంలో మరోసారి బెర్త్ దక్కలేదు. గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా చేసిన స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, నితీశ్ ప్రామాణిక్, అజయ్ మిశ్రా, సుభాష్ సర్కార్, భారతి పవార్, కపిల్ పాటిల్ ఎన్నికల్లో ఓడిపోయారు. మీనాక్షి లేఖి, వీకే సింగ్ అశ్విని కుమార్ చౌబే అసలు ఎన్నికల్లోనే పోటీచేయలేదు.