న్యూఢిల్లీ : తనను తాను కరడు గట్టిన హిందువుగా అభివర్ణించుకొన్న స్వతంత్ర భరద్వాజ్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు శుక్రవారం కలకలం రేపాయి. ‘జూలైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన ఆందోళనలో నేను నిషు ఆజాద్ అనే విద్యార్థిని తండ్రి పుర్రె(తల) పగులగొట్టాను. ఈ నేరానికి ఏ సెక్షన్ వర్తిస్తుందో తెలుసా.. సెక్షన్ 307.. అతడికి 60 కుట్లు అవసరం. అతడి కూతురు పోలీస్స్టేషన్ బయట నిలబడి తన తండ్రికి న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంది.
కానీ నేను జైలుకు కూడా వెళ్లలేదు. ఆ రాత్రంతా నేను బయటే తిరుగుతున్నా’ అని ఆ ఇంటర్వ్యూలో స్వతంత్ర భరద్వాజ్ వ్యాఖ్యానించారు. దీనిపై సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్, ఎంపీ చంద్ర శేఖర్ ఆజాద్, విపక్ష నేతలు రాహుల్ గాంధీ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ వీధి పోలీస్ స్టేషన్ వద్ద దీనిపై నిరసన తెలిపారు. అయి తే బాధితుడు సంజయ్కు అయిన గాయాలు సాధారణమైనవేనని.. అతడి పుర్రె పగిలిందన్న వాదనలను ఢిల్లీ డీసీపీ తోసిపుచ్చారు. అయితే సీజేపీ ధర్నాతో దిగి వచ్చిన పోలీసులు నిందితుడిని బులంద్ షహర్లో అరెస్ట్ చేశారు.