చెన్నై: ఒక వ్యక్తి బహిరంగంగా తన భార్య చెంపపై కొట్టాడు. తీవ్ర అవమానంగా భావించిన ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత డోర్ లాక్ చేసుకున్నది. కిరోసిన్ పోసి ఇద్దరు పిల్లలకు నిప్పంటించింది. ఆ మహిళ కూడా నిప్పంటించుకున్నది. ఇద్దరు కుమారులతో సహా ఆమె మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Woman Sets on fire With Sons) తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల మారియమ్మాళ్ తన ఇద్దరు కుమారులైన 6 ఏళ్ల కబినేశ్వరన్, 4 ఏళ్ల రబినేశ్వరన్తో కలిసి ఇంటి సమీపంలోని ఆలయంలో జరుగుతున్న సాంప్రదాయ నృత్య ఉత్సవానికి వెళ్లింది.
కాగా, ఆ మహిళ భర్త కాళిపాండి మద్యం మత్తులో ఆ ఆలయం వద్దకు చేరుకున్నాడు. అందరి ముందు భార్య చెంపపై అతడు కొట్టాడు. తీవ్ర అవమానంగా భావించిన మారియమ్మాళ్, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం తలుపులు వేసుకుని తన ఇద్దరు కుమారులకు నిప్పు అంటించింది. ఆ తర్వాత తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నది. ఆ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. మహిళ, ఆమె ఇద్దరు పిల్లల కాలిన మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త కాళిపాండిని విచారిస్తున్నారు. అతడు తరచుగా మద్యం సేవించి భార్యను వేధిస్తున్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి ఆరోపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.