ముంబై: ఒక వ్యక్తి తన ప్రియురాలి పసిబిడ్డను వేడి నీటి బకెట్లో ముంచి హత్య (toddler killed) చేశాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఖేడ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ శరద్ కొలేకర్ ఈ నెల 6న అక్రమ సంబంధం ఉన్న మహిళ ఇంటికి వెళ్లాడు. అయితే తన పసిబిడ్డను చూడమని అతడికి చెప్పి, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం విక్రమ్ దారుణానికి పాల్పడ్డాడు. ఆ పసి బాలుడ్ని వేడి నీటి బకెట్లో ముంచాడు. దీంతో ఆ చిన్నారి శరీరంపై కాలిన గాయాలయ్యాయి. పసిబిడ్డను ఆసుపత్రికి తరలించగా అడ్మిట్ చేసి చికిత్స అందించారు. అయితే 15 రోజుల తర్వాత ఆ పసి బాలుడు చనిపోయాడు.
కాగా, భర్తను వీడి వేరుగా నివసిస్తున్న ఆ మహిళ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి తాను నిరాకరించడంతో విక్రమ్ ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపించింది. తనతోపాటు తన సోదరిని కూడా హత్య చేస్తానని అతడు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడు విక్రమ్ శరద్ కొలేకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.