భువనేశ్వర్: భార్య తనను మానసికంగా హింసిస్తున్నదని భర్త ఆరోపించాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత పట్టాలపై వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man jumps in front of train) ఈ నేపథ్యంలో అతడి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని ఖోర్ధా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుంభార్బస్తాకు చెందిన రామచంద్ర బర్జెనాకు రెండేళ్ల కిందట రూపాలితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సంతానం.
కాగా, పెళ్లి నాటి నుంచి భార్య తనను మానసికంగా హింసిస్తున్నదని రామచంద్ర ఆరోపించాడు. తన భార్య కారణంగా తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. నిజిగఢ్-తపాంగ్ రైల్వే ట్రాక్ దగ్గర రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి పోలీసులు, రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు పెళ్లి నాటి నుంచి తన కుమారుడ్ని కోడలు రూపాలి వేధిస్తున్నదని రామచంద్ర తల్లి ఆరోపించింది. పెళ్లి ఖర్చులన్నీ తామే భరించామని, వధువు కుటుంబానికి 20 లక్షలు ఇచ్చామని తెలిపింది. అయితే తన కొడుకుతో కోడలు తరచుగా గొడవ పడి పుట్టింటికి వెళ్తుందని ఆరోపించింది. అక్కడకు రాని పక్షంలో అతడ్ని మానసికంగా వేధిస్తుందని చెప్పింది. భార్య క్రూరత్వం కారణంగా తన తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రామచంద్రను ఆత్మహత్యకు ప్రేరేపించిన భార్య రూపాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.