Maharastra elections : మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సందడి నెలకొంది. పోలింగ్‌కు ఇంకో నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేశాయి. ఒకటి అరా స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా మరో 22 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది.
కాగా బీజేపీ ఇప్పటికే తొలి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తాజా మరో 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ మొత్తం 121 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లయ్యింది. కాగా మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.