ముంబై: మహారాష్ట్రలోని బీడ్ కోర్టు ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే(Minister Dhananjay Munde)కు నోటీసులు జారీ చేసింది. మొదటి భార్య కరుణ ముండే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ నోటీసులు జారీ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదని మంత్రిపై మొదటి భార్య కరుణ ఫిర్యాదు చేసింది. పర్లీలోని కోర్టుకు చెందిన సివిల్ జడ్జీ, జుడిషియల్ మెజిస్ట్రేట్ సంయుక్తంగా మంత్రి సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు.
పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధనంజయ్ ముండే తన ఎన్నికల అఫిడవిట్లో భార్య రాజశ్రీ ముండే, ఆమె ముగ్గురు కుమార్తెలు, ఇంకా తన ఇద్దరి పిల్లల గురించి ప్రస్తావన చేశారని కరుణ తరపు లాయర్ చంద్రకాంత్ తోంబ్రే తెలిపారు. అయితే తన ఆధీనంలో ఉన్న ఆస్తులను ఆ నామినేషన్ పేపర్లలో వెల్లడించలేదని కరుణ ముండే ఆరోపించారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని 33ఏ, 125ఏ కింద ఆమె తొలుత ఆన్లైన్లో ఫిర్యాదు ఇచ్చింది. 33ఏ ప్రకారం నిజమైన సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెడితే 125ఏ ప్రకారం ఆర్నెళ్ల జైలు శిక్ష ఉంటుంది.
డాక్యుమెంట్లను పరిశీలించిన మెజిస్ట్రేట్.. పౌరసరఫరాల శాఖ మంత్రికి సమన్లు ఇచ్చారు. ఇప్పటికే ఓ సర్పంచ్ హత్య కేసులో మంత్రి ముండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కరుణ ముండేను వేధించిన కేసులో ఇటీవల కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మెయింటేనెన్స్ కింద ప్రతినెల రెండు లక్షలు చెల్లించాలని ఆదేశించింది.