Road Accident | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మైనర్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలంతా కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. విషాదకర ఘటనతో ఈ ప్రాంతమంతా మృతుల కుటుంబాల రోధనలతో మిన్నంటాయి. కుర్ఖేడ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పిల్లలందరినీ వేగంగా ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి ప్రాణాలు కాపాడలేకపోయారు.
మిగతా ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది విచారకరమైన, దురదృష్టకరమైన ప్రమాదమని.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని.. వారిని నాగ్‌పూర్‌కు హెలికాప్టర్లో తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీఎం వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు చెప్పారు. గాయపడ్డ విద్యార్థుల చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.