Madras High Court : భార్యకు ఆస్తులు, ఆదాయం భర్త కంటే ఎక్కువగా ఉంటే.. భర్త ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు (Madras High Court) తీర్పుచెప్పింది. ఓ కేసులో భార్యకు భర్త భరణం ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టు (Family court) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. భర్త కంటే అధికంగా ఆస్తులు, ఆదాయం కలిగి ఉన్న మహిళ.. భర్త నుంచి భరణం కోరజాలదని కోర్టు స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన వైద్య దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. వారికి ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ఒక కొడుకు ఉన్నాడు. వారి పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. భర్త తన భార్యకు నెలకు రూ.30 వేలు భరణంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
భర్త పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. పిటిషనర్ భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని, ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారని, అందుకు సంబంధించిన పత్రాలను పిటిషనర్ దాఖలు చేశారని పేర్కొంది. కాబట్టి పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పుచెప్పింది. వారి కుమారుడు నీట్ కోసం సిద్ధమవుతున్నాడని, అతడి చదువుకయ్యే ఖర్చు రూ.2.77 లక్షలు భరించడానికి పిటిషనర్ అంగీకరించారని తెలిపింది.
కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని, చదువు ఖర్చులు ఇచ్చినా, ఇవ్వకపోయినా భార్యకు భర్త భరణం ఇవ్వాల్సిందేనని ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.