
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని లుధియానా జిల్లా కోర్టులో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదిని జర్మనీలో అరెస్టు చేసినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. డిసెంబర్ 23న లుధియానా కోర్టులో పేలుళ్లు సంభవించగా, ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ పేలుళ్లకు పాల్పడ్డ వ్యక్తిని నిషేధించబడిన సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థకు చెందిన జశ్విందర్ సింగ్ ముల్తానీగా గుర్తించారు. ఇక ఢిల్లీ, ముంబైలో కూడా బాంబు పేలుళ్లు జరిపేందుకు జశ్విందర్ సింగ్.. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలను దిగుమతి చేసుకున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
జర్మనీలో ఉన్న జశ్విందర్ సింగ్‌పై ఫిరోజ్‌పూర్, అమృత్సర్, తరణ్ జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. రైతు ఉద్యమ నాయకుడు బల్బీర సింగ్ రాజేవాల్‌ను సింఘూ బోర్డర్ వద్ద చంపేందుకు ముల్తానీ కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజేవాల్‌ను హత్య చేయించేందుకు జీవన్ సింగ్‌ను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. జీవన్ సింగ్‌ను మహారాష్ట్రలో అరెస్టు చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
పంజాబ్ పోలీసులు జీవన్‌ను విచారిస్తున్న క్రమంలో జశ్విందర్ సింగ్ ముల్తానీ పేరు బయటపడింది. జీవన్ సింగ్ ఫోన్ డేటాను విశ్లేషణలో కూడా జశ్విందర్తో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. అలా సీక్రెట్ యాప్‌ల ద్వారా జీవన్ సహకారంతో లుధియానా కోర్టులో పేలుళ్లకు పాల్పడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే పేలుళ్లు జరిగిన ప్రాంతంలో డాంగిల్ కూడా లభ్యమైంది. దీంతో ఇంటర్నెట్ సాయంతోనే పేలుళ్లకు పాల్పడినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.