బెంగళూరు: కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్) మాజీ క్లర్క్ ఇంట్లో లోకాయుక్త అధికారులు శుక్రవారం సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. నెలకు రూ.15 వేల జీతంతో పనిచేసిన కలకప్ప నిడగుండి 24 ఇండ్లు, నాలుగు ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమికి యజమానిగా ఉన్నట్టు కనుగొన్నారు. నాలుగు వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండిని రికవరీ చేశారు. ఈ ఆస్తులన్నీ అతడితో పాటు అతడి భార్య, సోదరుడి పేరిట ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
కలకప్ప, కేఆర్ఐడీఎల్ మాజీ ఇంజినీర్ కలిసి 96 అసంపూర్తి ప్రాజెక్టులకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి రూ.72 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై లోకాయుక్త అధికారులు ఇటీవల దాడులు చేస్తున్నారు. గత నెల 23న ఒక ఐఏఎస్ అధికారితో సహా 8 మంది అధికారుల ఇండ్లలో సోదాలు చేసి రూ.37.42 కోట్లు రికవరీ చేశారు.