పాట్నా, జూలై 30: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు.. ఇదీ అలాంటిదే.. బీహార్‌లోని సారణ్ జిల్లాకు చెందిన సంత్ జైశ్రీరాం దాస్ 12 ఏండ్లుగా అన్నం తినడం లేదు. ఆకులు, పువ్వులు మాత్రమే భుజించి బతికేస్తున్నాడు. పానాపూర్ ప్రాంతవాసి అయిన దాస్‌ను.. స్థానికులు బెల్పతి బాబాగా కొలుస్తారు.
శివుడికి బిల్వపత్రం అంటే ప్రీతి. శివుడి భక్తుడైన జై శ్రీరాందాస్ కూడా ఔషధగుణాలు ఉండే బిల్వ ఆకులు (మారేడు ఆకులు), ఇతర చెట్ల ఆకులు, పువ్వులు ఆహారంగా తీసుకుంటాడు. ఎండు మిరపకాయలతో హోమం చేస్తాడు. శ్రావణమాసంలో మూడురోజులపాటు ఈ హోమం నిర్వహిస్తాడు. కేవలం ఆకులు, పువ్వులు మాత్రమే తింటూ జీవనం సాగిస్తున్నా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం వల్లే ఇది సాధ్యపడిందని పేర్కొన్నారు.