న్యూఢిల్లీ, జనవరి 1: నిద్రలేమి, ఆందోళనతో బాధపడేవాళ్లలో రోగ నిరోధకశక్తి దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. శాస్త్రీయంగా దీనికి గల కారణాల్ని సౌదీ అరేబియాలోని ‘తాయెబా వర్సిటీ’ పరిశోధకుల బృందం కనుగొనేందుకు ప్రయత్నించింది. వీరి నివేదిక ప్రకారం, నిద్రలేమి, ఆందోళన రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తు, ఓ వ్యక్తిని రోగం బారినపడేట్టు చేస్తున్నదని మరోసారి నిరూపణ అయ్యింది. 60మంది యువతలను ఇంటర్వ్యూ చేసి, వారిలో నిద్రలేమి, ఆందోళన ఏ స్థాయిలో ఉందనేది గుర్తించారు. రక్త నమూనాలను విశ్లేషించారు. నిద్రలేమి, ఆందోళన తక్కువ, స్వల్ప స్థాయిలో ఉన్నవాళ్లలో రోగ నిరోధక కణాల సంఖ్య తక్కువగా ఉందన్న సంగతి గుర్తించారు. ఆందోళన, నిద్రలేమి నుంచి ఏర్పడే శారీరక పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో సహాయపడిందని సైంటిస్టుల బృందం తెలిపింది.