జైపూర్: మధ్య ప్రదేశ్లోని అథన గ్రామస్థుడు కృష్ణ కుమార్ ధాకడ్ (33) వినూత్న నిరసన చేపట్టారు. తన భార్య చట్టా న్ని దుర్వినియోగపరచి, తనను అక్రమంగా వరకట్న వేధింపుల కేసులో ఇరికించిందని ఆరోపిస్తూ, ఆమె తల్లిదండ్రుల ఇంటి ముందే ‘498ఏ టీ కేఫ్’ను తెరిచారు. దానిలో తన పెండ్లినాటి తలపాగా, పూలమాలలను వేలాడదీశారు. ‘న్యాయం జరిగే వరకు టీ మరుగుతూనే ఉంటుంది’, ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం : సెక్షన్ 125 కోసం మనం ఎంత చెల్లించాలి?’ అనే నినాదాలను తన టీ స్టాల్లో రాశారు. అంతేకాకుండా, తన చేతులకు సంకెళ్లు వేసుకుని, టీని తయారు చేసి, వినియోగదారులకు అందిస్తున్నారు. టీ కోసం వచ్చేవారంతా ఆయన గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
తన టీ స్టాల్కు వచ్చేవారితో కృష్ణ మాట్లాడుతూ.. రాజస్థాన్లోని అంటాహ్కు చెందిన యువతితో తనకు 2018లో వివాహం జరిగిందని చెప్పారు. 2019లో తామిద్దరమూ కలిసి తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించామన్నారు. 2022లో తమ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చాయని, తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు. మానసిక క్రూరత్వం, వరకట్న వేధింపుల ఆరోపణలతో తన భార్య తనపై కేసు పెట్టిందన్నారు. విడాకులకు అంగీకరించాలంటే రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసిందన్నారు. తమ ఉమ్మడి ఆస్తిని కూడా ఆమె తీసుకుందని చెప్పారు.