Messi Event : అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Leonal Messi) పర్యటన సందర్భంగా గత ఆదివారం పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సాల్ట్ లేక్ స్టేడియం (Salt lake stadium) కు వచ్చిన మెస్సీ కొన్ని నిమిషాల్లోనే వెళ్లిపోవడంతో అభిమానులు అందోళనకు దిగారు.
తాము డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ వస్తే మెస్సీని చూడనివ్వలేదంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టేడియంలోని ఫర్నీచర్‌ను విరగ్గొట్టారు. దాంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నిర్వాహకుల వైఫల్యంవల్లే ఇలా జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. మెస్సీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతాబెనర్జికి తన రాజీనామా లేఖను పంపారు. ‘దీదీ.. కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తతలపై దర్యాప్తునకు మీరు ఇప్పటికే ఒక విచారణ కమిటీని నియమించారు. ఆ విచారణ నిష్పాక్షికంగా జరగడం కోసం నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. నా రాజీనామాను ఆమోదించాలని అభ్యర్థిస్తున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.