న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి వివాదస్పద వీడియో సందేశం ఇచ్చాడు. (Khalistani terrorist Pannun) భారత సైన్యంలోని సిక్కు జవాన్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కు సైనికులు పోరాడవద్దని విజ్ఞప్తి చేశాడు. సిక్కులకు, ఖలిస్థాన్‌కు పాకిస్థాన్ ‘స్నేహపూర్వక’ దేశమని పేర్కొన్నాడు. ‘భారతదేశం పాకిస్థాన్‌పై దాడి చేస్తే, అది భారతదేశానికి, ప్రధాని మోదీకి చివరి యుద్ధం అవుతుంది. భారతదేశం వైపు ఉన్న పంజాబీలు పాకిస్థాన్ సైన్యానికి లంగర్‌గా పనిచేస్తారు’ అని ఆ వీడియోలో అన్నాడు.
కాగా, సిక్కు సైనికులకు పాకిస్థాన్ శత్రువు కాదని పన్నూన్ తెలిపాడు. పంజాబ్‌ను విముక్తి చేసిన తర్వాత పొరుగుదేశం అవుతుందని చెప్పాడు. ‘ఇప్పుడు నరేంద్ర మోదీ యుద్ధానికి నో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్థాన్‌తో పోరాడకండి. పాకిస్థాన్ మీ శత్రువు కాదు. సిక్కు ప్రజలకు, ఖలిస్థాన్‌కు పాకిస్థాన్ స్నేహపూర్వక దేశంగా ఉంటుంది. మనం పంజాబ్‌ను విముక్తి చేసిన తర్వాత, పాకిస్థాన్ మన పొరుగు దేశం అవుతుంది’ అని అన్నాడు. పహల్గామ్లో హిందువుల ఊచకోత వెనుక మోదీ ప్రభుత్వం ఉందని పన్నూన్ ఆరోపించాడు.