తిరువనంతపురం: ఈ అందాల బొమ్మకు పాములంటే భయం లేదు. చాలా ఈజీగా వాటిని పట్టేస్తుంది. ఈమె పేరు జీఎస్ రోషిణి. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో బీట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. పారుత్తిపల్లి ఫారెస్ట్ రేంజ్‌లోని ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లో సభ్యురాలు కూడా. ప్రస్తుతం ఆమె పోస్టింగ్ ఇక్కడే ఉంది. ఈ బ్యూటీఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఓ పెద్ద స్నాక్ క్యాచర్(Snake Catcher). ఇంట్లో పాములు ఉన్నట్లు ఫోన్ రాగానే, అక్కడకు వెళ్లి వాటిని రెస్కూ చేస్తుంది.
2019లో పాములు పట్టడంలో ఒకే రోజు శిక్షణ తీసుకున్న ఈ బీట్ ఆఫీసర్ .. గడిచిన అయిదేళ్లలో 500 సర్పాలను పట్టేసింది. విషపూరితమైనవి, విషరహిత పాములు ఆ లిస్టులో ఉన్నాయి. పాములే కాదు.. ఎలుగుబంట్లు లాంటి కొన్ని ప్రాణాంతకమైన వన్య మృగాలను కూడా ఆమె బంధించింది. 2021లో తొలిసారి కల్లార్లో ఓ పైతాన్‌ను రెస్క్యూ చేసిందామె.
వాస్తవానికి కొండచిలువల్ని పట్టుకోవడం అంత సులువైన విషయం కాదు. అవి వాటి బలంతో మనిషిపై తీవ్ర వత్తిడి తెస్తుంటాయి. వీటిని పట్టుకోవాలంటే చాలా బలం కావాల్సిందే. పైతాన్లను పట్టుకున్న సమయంలో.. అవి మలమూత్రాలను విసర్జిస్తాయని, ఆ వాసన ఎన్ని సార్లు స్నానం చేసినా పోదు అని ఆమె తెలిపారు. కఠినమైన పరిస్థితులు ఎన్ని ఉన్నా.. పాములకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. తక్కువ రిస్క్‌తో వాటిని పట్టేస్తుంది.
రోషిణి భర్త కోఆపరేటివ్ శాఖ ఉద్యోగి. ఆ జంటకు ఇద్దరు పిల్లలు. తన కుటుంబం తనకు అండగా ఉన్నట్లు ఆమె చెబుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రోషిణి.. పలు వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వన్యప్రాణి సంరక్షణపై అవగాహన కల్పిస్తోంది. దయ, జాలి మాత్రమే కాదు.. జంతువుల పట్ల ప్రేమ కూడా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ చెబుతోంది.