గోపాలకృష్ణన్. కేరళలో సాధారణ ఆటో డ్రైవర్. ఆయన చేస్తున్న అసాధారణ సేవలను చూసి.. జిల్లా ప్రభుత్వం ఆయన్ను క్విక్ రెస్పాన్స్ టీమ్ (త్వరిత గతిన స్పందించే బృందం) లోకి తీసుకుంది. ఆయన చేసేదల్లా ఏమిటంటే.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని తన ఆటోలో ఉచితంగా దగ్గరగా ఉండే ఆస్పత్రికి తీసుకెళ్లడం. పాలక్కాడ్- కుల్లప్పుల్లీ ప్రాంతంలో ఈయన్ను అందరూ గుర్తుపడతారు. గోపీ లక్కిడీ అన్న పేరుతో పిలుచుకుంటారు.
గోపాలకృష్ణన్ను అందరూ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ఆయన చేసిన సేవలను తాము జీవితాంతం గుర్తుంచు కుంటామని చెబుతుంటారు. ఇలా.. ఇప్పటికి ఎందరో మంది ప్రాణాలను గోపాలకృష్ణన్ కాపాడుతున్నారు. 20 నిమిషాల పాటు నేను రోడ్డుపైనే పడిపోయి వున్న. ఆదుకున్న నాథుడు ఒక్కడంటే ఒక్కడూ లేడు. యాక్సిడెంట్ అయి, కిందపడి పోయి వుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి సురేశ్ అన్న వ్యక్తి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు అని గోపాల కృష్ణన్ చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన తర్వాతే గోపాలకృష్ణన్ మెకానిక్ జీవితానికి స్వస్తి పలికి, ఓ ఆటోను కొనుగోలు చేశాడు. ఆటోను కొనుగోలు చేసి, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళ్తున్నాడు. అంతేకాకుండా అంబులెన్స్లకు కూడా అనుసంధానంగా వుంటాడు. కోవిడ్ సమయంలో ఈ ఆటో డ్రైవర్ సేవలు నిరుపమానమని స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. కొన్ని వందల కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను ఆయన తన ఆటోలో ఆస్పత్రికి తరలించారని చెప్పుకుంటారు. అయితే ఈ సమయంలో మాత్రం అతి తక్కువగానే ఆటో ఛార్జీలు తీసుకున్నారు.
కొన్ని కొన్ని సార్లు అర్ధరాత్రులు కూడా ఆయనకు ఫోన్లు చేస్తారట. అటు పోలీసులు కూడా సహాయం కోసం రాత్రులు ఫోన్లు చేస్తారని ఆయన తెలిపారు. అలా అర్ధరాత్రులు, అపరాత్రులు ఫోన్లు వచ్చినా, తాను సత్వరమే స్పందిస్తానని ఆటో డ్రైవర్ గోపాల కృష్ణన్ పేర్కొన్నారు. అంతేకాకుండా యాక్సిడెంట్ వివరాలు, ఫొటోలను కూడా సోషల్ మీడియా పోస్ట్ చేస్తానని, తద్వారా సమాచారం అందరికీ అందుబాటులో వుంటుందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు.