భువనేశ్వర్: ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారి, ఆర్మీ వైద్యుడిగా నటించిన వ్యక్తి పలువురిని మోసగించడంతోపాటు ఏడుగురు మహిళలను పెళ్లాడాడు. పాకిస్థాన్‌లోని వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన 37 ఏళ్ల సయ్యద్ ఇషాన్ బుఖారీ అలియాస్ ఇషాన్ బుఖారీ అలియాస్ డాక్టర్ ఇషాన్ బుఖారీ, పీఎంవో అధికారి, ఆర్మీ వైద్యుడిగా నమ్మించి పలువురిని మోసగించాడు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ, కెనడియన్ హెల్త్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన మెడికల్ డిగ్రీ సర్టిఫికేట్లతో సహా అనేక నకిలీ పత్రాలను సృష్టించాడు. జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు ఏడుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు.
కాగా, అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్న సయ్యద్ ఇషాన్ బుఖారీ ఒడిశాలో ఉన్నట్లు ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జాజ్‌పూర్ జిల్లాలో అతడ్ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న విదేశీ నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, అఫిడవిట్లు, బాండ్లు, పలు ఏటీఎం కార్డులు, ఖాళీ చెక్కులు, ఆధార్ కార్డులు, విజిటింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐతో అతడికి సంబంధాలున్నాయా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్, జమ్ముకశ్మీర్, ఒడిశా పోలీసులతో కూడిన జాయింట్ టీమ్ నిందితుడి కార్యకలాపాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.