ప్రధాని మోది కర్ణాటకలో ప్రచారం చేసినంత తన స్వంత రాష్ట్రం గుజరాత్లో కూడా చేసుండరు. ప్రధాని హోదాలో ఏదో రెండు బహిరంగ సభలు, ఓ నాలుగు రోడ్ షోల్లో పాల్గొని సరిపెట్టుకుంటారు. విచిత్రమేమిటంటే… గల్లీ లీడర్ తిరిగినట్టు కర్ణాటకలో గల్లీ గల్లీ తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ఏకంగా 20 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. దీనికితోడు ప్రతీ చోటా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల సమయంలో మోదీతో పాటు మొత్తం జాతీయ స్థాయి నేతలంతా కర్ణాటకలోనే ఉన్నారు. మరి ఇన్ని చేసినా కన్నడ ప్రజలు ఎందుకు బీజేపీని తిరస్కరించారు?.. అసలు ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌ను ఎందుకు స్వాగతించారు?..
ఈ ప్రశ్నలకు జవాబు ఒకటే వినిపిస్తున్నది. కర్ణాటకలో బీజేపీ విద్వేషం ఓవర్‌డోస్ అయిందనే సమాధానం వినిపిస్తున్నది. అసలు సమస్యలను అడ్రస్ చేయకుండా, ప్రజలకు అక్కరకొచ్చే విషయాలు చెప్పకుండా జై భజరంగదళ్, హిజాబ్, హలాల్, జై శ్రీరామ్, కేరళ స్టోరి సినిమా, హిందూ ముస్లీమ్ వంటి మతపరమైన అంశాలను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. అదానీ కుంభకోణం గురించి మాట్లాడలేదు, పెరిగిన గ్యాస్ ధరల గురించి ప్రస్తావించలేదు. కర్ణాటకలో వైరల్‌గా మారిన 40 శాతం పర్సంటేజీ వంటి అవినీతి గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్నికల ప్రచారం మొత్తం మోదీ బ్రాండ్తోటే నడిచింది.
ఒక్కటంటే ఒక్క సమస్యను మోదీ అడ్రస్ చేయలేదు. పైగా కొన్ని ఉచిత పథకాలను కూడా ప్రకటించారు. ఇవన్నింటినీ ప్రజలు పట్టించుకోలేదు. సమస్యలనుంచి పూర్తిగా పక్కకు పోయి పనికిరాని విషయాలను ప్రచారం చేయడంతో బీజేపీ ప్లాన్ బెడిసికొట్టినట్లయింది. ప్రజలకు అవసరం లేని అంశాలను బీజేపీ బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించింది. అవేవి ఫలించలేదు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర, స్థానిక ముఖ్య నాయకుల ఐక్యంగా పనిచేయడం వంటి అంశాలు కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. బీజేపీ మైనస్‌లను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. దీంతో కర్ణాటకలో హస్తం బిగ్ విక్టరీ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు హంగ్ కాకుండా కన్నడ ప్రజలు స్ఫష్టమైన తీర్పునిచ్చారు. కంప్లీట్‌గా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు. హంగ్ వస్తే బీజేపీ తన అధికార, ధన బలంతో ఎక్కడ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటదో అన్న సోయితో జనం ఓటు వేశారు. 135 కు పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు.