బెంగళూరు, మార్చి 29: హిందూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేయడానికి ముస్లింలు సహా హిందూయేతరులకు అనుమతి లేదంటూ కర్ణాటక బీజేపీ సర్కారు ఇటీవల చేసిన ప్రకటనపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అదో పిచ్చి చర్య అని మండిపడుతున్నారు. విదేశాల్లో అనేక మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారని, ఒకవేళ ఆ దేశాలన్నీ భారతీయులను వెనక్కి పంపిస్తే వాళ్లందరికీ మీరు (బీజేపీ) ఉద్యోగాలిస్తారా అని ఎమ్సెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా బెళగావి నార్త్ ఎమ్మెల్యే అనిల్ బెనాకే కూడా స్పందించారు. ‘నిర్ణీత దుకాణాల్లోనే కొనుగోళ్లు జరుపాలని పౌరులను బలవంతపెట్టడం తప్పు. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులను ప్రసాదించిందని గుర్తుంచుకోవాలి. ఎవరైనా, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఎక్కడ కొనుగోళ్లు చేయాలో ప్రజల ఇష్టం. ఆలయాల దగ్గర ముస్లింలు వ్యాపారం చేస్తే తప్పేంటి? ప్రభుత్వ నిర్ణయానికి నేను సానుకూలం కాదు’ అని వ్యాఖ్యానించారు.