బెంగళూరు, సెప్టెంబర్ 3: కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి వివాదంలో చిక్కుకున్నారు. తమ బిల్డింగ్ ప్రహరీ కూల్చివేతకు వ్యతిరేకంగా ఓ మహిళ ఆందోళనకు దిగడంతో ఆయన హద్దు మీరారు. ఆ మహిళపై బెదిరింపులకు దిగడంతో పాటు దుర్భాషలాడారు. ‘సర్, గోడ నిర్మాణం అక్రమం కాదు, అధికారుల నుంచి సంబంధిత అనుమతులన్నీ తీసుకున్నాను. నేను ఒక మహిళను, గౌరవించండి, నేను చెప్పేది వినండి..’ అని మహిళ అభ్యర్థించినా.. ‘నీకు గౌరవం ఇవ్వాలా? ఈమెను లాక్కెళ్లండి.. తన్ని జైల్లో వేయండి’ అంటూ ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. బాధిత మహిళ చేతిలో ఉన్న డాక్యుమెంట్లను సైతం లాక్కొని నేలపై విసిరేశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఆ మహిళను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి, కొంతసేపటి తర్వాత విడిచిపెట్టారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై కాంగ్రెస్ మండిపడింది. దీనిపై అరవింద్ స్పందిస్తూ.. ఆమెను నేనేమైనా రేప్ చేశానా? అంటూ అసంబద్ధ ప్రేలా పనలు చేశారు.