PM Modi | తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వ ఏలుబడిలో ఆకలిసూచీలో 107వ ర్యాంకుకు పడిపోయిన భారతంలో కంది కష్టాలు కూడా మొదలయ్యాయి. ‘ఓట్లేసి గెలిపించిన మాకు.. పప్పన్నం కూడా పెట్టలేవా మోదీ?’ అంటూ సామాన్యులు దీనంగా అడుగుతున్నారు. కందిపప్పు దిగుబడులపై కేంద్రం ముందుచూపుతో వ్యవహరించకపోవడమే ఈ దుస్థితికి కారణం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కంది (Toor Dal) కష్టాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. కిలో పప్పు ధర రూ. 150 వరకు చేరుకొన్నది. పిరం అయినప్పటికీ.. పప్పు కొనుగోలు చేద్దామని సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, కిరాణా దుకాణాలకు వెళ్లిన కస్టమర్లకు ‘నో స్టాక్’, ‘లిమిటెడ్ సేల్’ బోర్డులే కనిపిస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతోనే కందిపప్పు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. దేశ జనాభాలో ఎక్కువమంది కందినే ప్రధాన పప్పు దినుసుగా పరిగణిస్తారు.
దేశీయ అవసరాలకు ఏడాదికి దాదాపు 58 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరపడుతుంది. అయితే ఈ ఏడాది దిగుబడి 38.9 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. కొరతను పూడ్చడానికి మయన్మార్, సూడాన్, టాంజానియా, మోజాంబిక్ నుంచి ఇప్పటికే కందిపప్పును కేంద్రం దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే, పంట దిగుబడిపై కేంద్ర వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించలేదు. దీంతో విదేశాల నుంచి పప్పు దిగుమతులపై కేంద్రం సకాలంలో నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా కందిపప్పునకు తీవ్ర కొరత ఏర్పడిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. డిమాండ్-సైప్లె అంతరంపై కేంద్రం ముందస్తుగా అంచనాలు వేయకపోవడం, అకాల వర్షాలు కూడా కంది కొరతకు కారణంగా చెబుతున్నారు. పరిమితంగా ఉండటంతో కొందరు ఎక్కువ ధరకు కందిపప్పు విక్రయిస్తున్నారు.
కంది కష్టాలపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్రం పప్పు నిల్వలపై గతవారం పరిమితులు విధించింది. హోల్‌సేలర్లు 200 మెట్రిక్ టన్నులకు మించి, రిటైలర్లు 5 మెట్రిక్ టన్నులకు మించి, బిగ్ చెయిన్ రిటైలర్లు 200 మెట్రిక్ టన్నులకు మించి కంది నిల్వలు ఉంచుకోకూడదని పేర్కొన్నది. ఈ పరిమితులు అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటాయన్నది. గోదాముల్లో పప్పే లేనప్పుడు ఇక నిల్వల ముచ్చట ఎక్కడిదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.