న్యూఢిల్లీ: రెండు దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు ఒక్కటాయి. జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనం అయ్యాయి. ఆ కలయిక ఇప్పుడు ఆన్లైన్ ప్రేక్షకుల్ని జియోహాట్‌స్టార్(JioHotstar) రూపంలో థ్రిల్ చేయనున్నది. జియోహాట్‌స్టార్ ఫ్లాట్‌ఫామ్‌లో రెండు ఓటీటీల్లో ఉన్న లైబ్రరీ కాంటెంట్‌ను ప్రజెంట్ చేయనున్నది. షోలో, సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా ప్రేక్షకులు చూడవచ్చు. ఇతర అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు చెందిన కాంటెంట్‌ను కూడా జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి.
జియోహాట్‌స్టార్‌ను ప్రారంభిస్తున్నట్లు జియోస్టార్ తమ ప్రెస్ రిలీజ్లో పేర్కొన్నది. కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన వివరాలను షేర్ చేసింది. రెండు మేటి ఫ్లాట్‌ఫామ్‌లు కలవడంతో దాదాపు మూడు లక్షల గంటల కాంటెంట్ యూజర్స్‌కు అందుబాటులోకి రానున్నది. దీంతో పాటు స్పోర్ట్స్ లైవ్ కవరేజీలు కూడా ఉంటాయి.
రెండు ఓటీటీలకు చెందిన సుమారు 50 కోట్ల మంది యూజర్లు ఇప్పడు జియోహాట్‌స్టార్ సబ్స్క్రైబర్స్ కానున్నారు. కొత్త ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు. ఏడు పాయింట్లు ఉన్న నక్షత్రం ఇప్పుడు ఆ లోగోపై ఉంటుంది. జియోహాట్‌స్టార్‌లోని కాంటెంట్‌ను ప్రస్తుతం ఉచితంగా అందివ్వనున్నారు. షోలు, సినిమాలు, స్పోర్ట్స్ లైవ్ చూసేందుకు ప్రస్తుతం ఎటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. అయితే ఉత్తమ అనుభూతి కోసం మాత్రం కొన్ని ప్లాన్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు జియోస్టార్ పేర్కొన్నది. సబ్‌స్క్రైబర్స్‌కు యాడ్స్ లేకుండా స్ట్రీమింగ్ ఉంటుంది. వాళ్లకు హై రెజల్యూషన్ లో ప్రసారాలు ఉంటాయి.
కొత్తగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే, కనీస ప్లాన్‌ను రూ.149 నుంచి స్టార్ట్ చేశారు. ఇండియాకు చెందిన పది భాషల్లో జియోహాట్‌స్టార్ కాంటెంట్ అందుబాటులో ఉంటుంది.