రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేపనిలో సీఎం హేమంత్ సోరెన్ నిమగ్నమయ్యారు. బీజేపీ ప్రలోభాల బారిన ఎమ్మెల్యేలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా యూపీఏ కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు తరలించవచ్చని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో శనివారం కొందరు ఎమ్మెల్యేలు బ్యాగ్‌లు, లగేజ్‌లతో సీఎం సోరెన్ ఇంటికి చేరుకున్నారు. సమావేశం తర్వాత వారంతా బస్సుల్లో బయలుదేరారు. కుంతి జిల్లాలోని అతిథి గృహానికి వారిని తరలించినట్లు తెలుస్తున్నది.
కాగా, సీఎం సోరెన్ సొంతంగా మైనింగ్‌ను లీజ్‌కు తీసుకున్నట్లు బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశాన్ని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్‌కు రిఫర్ చేశారు. దీంతో ఆయన ఈసీ సలహా కోరారు.
మరోవైపు సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సూచించింది. దీంతో గవర్నర్ రమేష్ బైస్ ఈ మేరకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మధ్యంతర ఎన్నికలకు సోరెన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
కాగా, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో 30 మంది ఎమ్మెల్యేలతో అది పెద్ద పార్టీగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉంది. ఆ పార్టీ చీఫ్, సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్షమైన బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలున్నారు.
అయితే యూపీఏ కూటమి ప్రభుత్వంలోని మొత్తం 49 ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 43 మంది మాత్రమే మిగిలారు. మిగతా ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసినట్లు సీఎం సోరెన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని రిసార్ట్‌కు తరలించారు.