Kalpana Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. కేసుల నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. సోరెన్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో భార్య కల్పన సోరెన్ బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ సోదరి అంజలి సోరెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కల్పా సోరెన్ సీఎం కాబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై అంజిలి సోరెన్‌ను మీడియా ప్రశ్నించింది.
దీనికి ఆమె బదులిస్తూ ‘అవసరమైతే ఆమె సీఎం కావొచ్చు. మా పార్టీలో ఇంకా పలువురు నేతలు ఉన్నారు. అయితే, పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. అవసరమైతే ఆమె సీఎం కావొచ్చు’ అని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ సోరెన్ ప్రభుత్వం గిరిజన ప్రభుత్వమన్నారు. తాము గిరిజనులం కాబట్టే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం పనిలో కొనసాగితే ఆదివాసీల ఓట్లు పడవని భయపడుతున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. భూకుంభకోణం కేసులో ప్రశ్నించేందుకు ఈడీ హేమంత్ సోరెన్‌కు ఆరుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన విచారణకు హాజరుకావడం లేదు. తాజాగా ఏడోసారి సమన్లు జారీ చేస్తూ.. ఎప్పుడు, ఎక్కడ కలుస్తారో స్వయంగా చెప్పాలని ఈడీ సీఎంను కోరింది. మరో వైపు విచారణకు హాజరుకాకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈడీ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయనను ఈడీ అరెస్టు చేసే కల్పనా సోరెన్‌ను సీఎంగా టాక్ నడుస్తున్నది. అయితే, ఈ చర్చలను హేమంత్ సోరెన్ తోసిపుచ్చారు.