Baramulla | జమ్మూ కశ్మీర్ బారాముల్ల జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని మల్ఖానాలో గురువారం ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు చోటు చేసుకున్నది. ఈ పేలుడులో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు. పేలుడు అనంతరం భద్రతా బలగాలు వేగంగా స్పందించారు. వేగంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. మల్ఖానా లోపల ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలిందని.. డిప్యూటీలో ఉన్న సిబ్బందిలో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పేలుడు ఘటనపై వచ్చే వదంతులను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. పేలుడు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పుల్వామా జిల్లాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. కశ్మీరేతర కార్మికుడే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. త్రాల్లో యూపీకి చెందిన ప్రీతమ్ సింగ్ అనే ఓ కార్మికుడిపై కాల్పులు జరిపారు. దాంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. గతవారం రోజులుగా స్థానికేతర కార్మికులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల సోనామార్గ్ సమీపంలో గగాంగీర్ ప్రాంతంలో జెడ్ మోర్ సొరంగం పనులు చేపడుతున్న కంపెనీలో పని చేస్తున్న కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. వైద్యుడితో పాటు ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లో నడుస్తున్న అన్ని పెద్ద ప్రాజెక్టులలో వలస కార్మికులు పని చేస్తుంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లకు చెందిన కార్మికులు కశ్మీర్‌లోని యాపిల్ తోటలతో పాటు ప్యాకింగ్ పనుల్లో పాల్గొంటారు.